Medical counseling notification released for Management Quota seats
ప్రైవేట్ వైద్య విద్య కాలేజీల్లోని మేనేజిమెంట్ (బీ, సీ) ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 17 నుంచి 19 వరకు ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని కాళోజీ నారాయణరావు వీసీ కరుణాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని జి.రాంరెడ్డి దూర విద్య కేంద్రంలో సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 11న యూనివర్సిటీ విడుదల చేసిన మేనేజీమెంట్ కోటా మెరిట్ జాబితాలోని అభ్యర్థులు కౌన్సెలింగ్ కు హాజరు కావాలన్నారు. ర్యాంకుల వారీగా కేటాయించిన తేదీల్లో అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు.
మొత్తం 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సంబంధించి మేనేజిమెంట్ సీట్లలో ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేస్తారు. అలాగే 11 డెంటల్ కాలేజీల్లోని సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. 17న ప్రొవిజనల్ మెరిట్ లిస్టులోని 1 నుంచి 800 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 18న 801 ర్యాంకు నుంచి 1,900 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 19న 1,901 ర్యాంకు నుంచి 3,501 ఆపై ర్యాంకులకు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు యూనివర్సిటీకి ఫీజును డీడీ రూపంలో తీసుకురావాల్సి ఉంటుంది.
బీ. కేటగిరీ ఎంబీబీఎస్ విద్యార్థులు రూ.40 వేలు, బీడీఎస్ విద్యార్థులు రూ.20 వేల డీడీ చెల్లించాలి. నీ కేటగిరీ ఎంబీబీయస్ కు రూ.10 వేలు, బీడీయస్ కు రూ.40 వేల ఫీజు డీడీ తీసుకురావాలి. ఇప్పటికే నీట్ ద్వారా ఎక్కడైనా చేరిన తెలంగాణ విద్యార్థులకు మాత్రం ఈ కౌన్సెలింగ్ లో పాల్గొనడానికి వీలుండదు. కస్టోడియన్ సర్టిఫికెట్లను అనుమతించబోమని స్పష్టంచేశారు.